Srimad Valmiki Ramayanam

Balakanda Sarga 46

Diti's sorrow !

హతేషు తేషు పుత్త్రేషు దితిః ప రమ దుఃఖితా |
మారీచం కాశ్యపం రామ భర్తారం ఇదమబ్రవీత్ ||

తా|| ఓ రామా ! తన పుత్రులు చంపబడటవలన దితికి చాలా దుఃఖము తో భర్త మరీచుని పుత్రుడు అయిన కాశ్యపునితో ఇట్లు పలికెను.

బాలకాండ
నలుబది ఆఱవ సర్గము
(అసుర మాత దితి దుఃఖము)

విశ్వామిత్రుడు ఇంద్ర విజయము తరువాత కథ చెప్పసాగెను.

'ఓ రామా ! తన పుత్రులు చంపబడటవలన దితికి చాలా దుఃఖము తో భర్త మరీచుని పుత్రుడు అయిన కాశ్యపునితో ఇట్లు పలికెను. "ఓ భగవన్ ! మహాబలవంతులైన నీ పుత్రలచే చంపబడిన పుత్రులు కలదానను అయితిని. దీర్ఘమైన తపము ఒనరించి ఇంద్రుని చంపగల పుత్రుని కోరుకొనెదను. నేను తపస్సు చేసెదను. నీవు అనుమతి ఇచ్చుటకు అర్హుడవు. దయతో ముల్లోకములకు అధిపతి మరియు ఇంద్రుని చంపగల పుత్రుని ప్రసాదించుము".

'మహాతేజోవంతుడైన మరీచుని పుత్రుడగు కాశ్యపుడు ఆమె యొక్క ఆ వచనములను విని పరమ దుఃఖిత అయిన దితి తో ఇట్లు పలికెను. "ఓ తపోధనులారా ! అట్లే అగుగాక | నీకు శుభమగుగాక | నీవు పవిత్రముగా ఉండుగాక. ఇంద్రుని హతమొనర్చగల పుత్రుడు జన్మించెదడు. నీవు వేయి సంవత్సరములు పూర్తిగా పతివ్రతగా ఉండినచో ముల్లోకములకు అధిపతి అగు నా పుత్రునికి నీవు జన్మనిచ్చెదవు". ఇట్లు చెప్పి హస్తముతో ఆదరించి శుభమగుగాక అని చెప్పి తపమాచరించుటకు వెళ్లెన".

'ఓ నరశ్రేష్ఠా ! ఆయన వెళ్ళిపోగా దతి పరమ హర్షముతో కుశప్లవనము చేరి తపస్సును ఆచరించెను. ఓ నరశ్రేష్ఠా ! అమె అట్లు తపమొనర్చుచుండగా సహస్రాక్షుడు వినయముతో పరిచర్యలను చేయసాగెను. ఇంద్రుడు అగ్నిని, కుశలను, సమిధలను, నీరు, కంద మూల ఫలములు అలాగే కావలసిన వస్తువులన్నీ సమకూర్చుచుండెను. ఇంద్రుడు అన్ని సమయములలోనూ అవయవములను ఆదరించుచూ శ్రమ తోలగునట్లు చేయుచూ పరిచర్యలు సలిపెను'.

'ఓ రఘునందన ! వేయిసంవత్సరములలో పది సంవత్సరములు ఉండగా దితి అతి సంతోషముతో ఇంద్రునితో ఇట్లు చెప్పెను. "ఓ సురశ్రేష్ఠా ! మహాత్ముడైన నీ తండ్రి వరము అడిగినప్పుడు వేయిసంవత్సరములు తరవాత నాకు పుత్రుడు కలుగునని ప్రసాదించెను . ఓ పరాక్రమశాలీ ! నా తపస్సు లో ఇంకా పది సంవత్సరములు మిగిలి ఉన్నయి. అప్పుడు నీ తమ్ముని చూడగలవు. నీకు శుభమగుగాక .నిన్ను చంపగల పుత్రుడు విజయమునకు ఉత్సకుడైనప్పుడు అప్పుడు నేను అతనిని శాంతపరచెదను. త్రిలోక విజయము ఆ పుత్రునితో అనుభవించెదవు".

'దితి ఈ విధముగా చెప్పచుండగా మధ్యాహ్నమయ్యెను. ఆ దేవి నిద్రలో శిరస్సు పాదములవేపు పడెను. శిరస్సు పాదములను తాకెను. పాదములు కేశములను తాకెను. అ అశుచి కర్మను చూచి ఇంద్రుడు దరహాసముతో సంతోషపడెన".

'ఓ రామా ! ఇంద్రుడు ఆమె శరీరములో ప్రవేశించి గర్భమును ఏడుముక్కలుగాచేసెను. ఓ రామా ! నూరు అంగుళముల వజ్రాయుథము తో గర్భము చేధింపగా ఆ గర్భ శిశువు సుస్వరముతో ఏడవసాగెను. అప్పుడు దితికి తెలిసెను. ఇంద్రుడు "ఏడవకుము" "ఏడవకుము" అని చెప్పెను. ఏడుచుచున్ననూ మహాతేజోవంతుడైన ఇంద్రుడు మరల ఛేదించెను. దితి "చంపకుము" "చంపకుము" అని పలికెను. ఇంద్రుడు తల్లి మాటమీద గౌరవము తో అచటినుండి బయటికి వచ్చెను'.

'వజ్రాయుధముతో నున్న ఇంద్రుడు నమస్కరించి ఇట్లు పలికెను. "ఓ దేవీ పాదములవేపు శిరముంచి నీవు అశుచివి అయితివి. ఆ అవకాశము చూచి నేను ఇంద్రుని హతమార్చగల గర్భమును ఏడువిధములుగా చేసితిని. ఓ దేవీ అందువలన నన్ను క్షమించుము "

||ఈ విథముగా శ్రీమద్వాల్మీకి రామయాణం లో బాలకాండలో నలుబది ఆరవ సర్గము సమాప్తము.||

|| ఓం తత్ సత్ ||

తదంతర మహం లబ్ధ్వా శక్ర హంతారమాహవే |
అభిందం సప్తధా దేవీ తన్మే త్వం క్షంతుమర్హసి ||

తా|| "ఆ అవకాశము చూచి నేను ఇంద్రుని హతమార్చగల గర్భమును ఏడువిధములుగా చేసితిని. ఓ దేవీ అందువలన నన్ను క్షమించుము "

|| ఓం తత్ సత్ ||

 


|| om tat sat ||